తెలుగు పాటలో తెలుగుతనం!

ముత్యాలముగ్గు ఒక గొప్ప తెలుగు సినిమా! పెద్ద చిన్న అందరికీ ఆ రోజులలో ఇష్టమైన చిత్రం – పాటలకి, పాటలకి! మా ఊరులో ఒక రిక్షాలో మైక్ పెట్టుకొని ఆ సినిమా విడుదల, సినిమా హాలు గురుంచి ప్రచారం చేయడానికి వచ్ఛేది – ముత్యాలముగ్గుకి ఓక చిన్న ముగ్గులు ఉన్న పుస్తకం ఉచితంగా పంచిపెట్టేవారు ! అందులోనూ అది నవంబరులో విడుదల అయ్యింది. పల్లెలలో సంక్రాంతి సంబరాలకు అప్పడికే ఇంతో కొంతో తయారీలు మొదలయ్యే ఉంటాయి! మా వీధి లో ఆడ వారు ఈ ముగ్గులు కూడా వేసే వారు! అంత హడావుడి పెట్టింది ఈ సినిమా విడుదల. ఇంక పాటలైతే రోజంతా ఎక్కడో అక్కడ మోగుతూనే ఉండేది. బాపు గారి దర్శకత్వం, ముళ్ళపూడి వారి కథ / మాటలు,  మహదేవన్ గారి సంగీతం, రావుగోపాలరావు, అల్లు, సంగీత, ముక్కామల, శ్రీధర్, కాంతారావు, సూర్యాకాంతం ల నటన అద్భుతం. బేబీ రాధ, మాస్టర్ మురళి ల నటన కూడా చూడ ముచ్ఛటగా ఉంటుంది

బాపు గారు ముళ్ళపూడి గారు కలిస్తే – మన తెలుగు వాళ్లకి ఇంకేమి కావాలి. తెలుగు భాష, తెలుగు సాంస్కృతి కి అద్దం పట్టి చూపిన సన్నివేశాలు బోలెడు ఈ సినిమాలో. పల్లెటూరి జీవనం కొంత అలవాటైన నాకు ఈ సినిమాలో చిన్న చిన్న విషయాలన్నీ చాలా నచ్చాయి. ఇప్పటికీ ఈ సినిమాలోని కొన్ని పాటలు వింటుంటే ఆ అనుభూతుల్నినెమరువేసుకుంటా! అలాంటి ఒకపాట గురించి వ్రాయాలని నా ప్రయత్నం …

ఈ పాటలో కథానాయిక పెళ్లి అయ్యి అత్తారింటికి వచ్చి …. పొద్దున్నే లేచి  ఈ పాట పాడుకొంటూ పనులు చేసుకుంటుంది.

ముత్యమంతా పసుపు ముఖమెంతో చాయ
ముత్తైదు కుంకుమ బతుకంతా చాయ
ముద్దు మురిపాలొలుకు ముంగిళ్ళలోన
మూడు పువ్వులు ఆరు కాయల్లు కాయ

ఉదయం స్నానం చేయడానికి ముందర స్త్రీలు ముఖానికి పసుపు రాసుకొని, ఇంటి పనులు చేసుకుంటూ, ముఖం ఆరిన తర్వాత స్నానానికి వెళతారు. అలా తీసుకొనే పసుపు ముత్యంమంతే (కొంచమే) – కానీ అది ముఖానికంతా కాంతినిస్తుంది. ఆ పైన నుదిటిమీద కుంకుమ బొట్టు ఉండి, బ్రతుకు అంతా హాయిగా సాగిపోతుంది. ముద్దు మురిపాలు సాగే ఆ ఇంటి ముంగిళ్లు ఎల్లప్పుడూ పూలు పళ్లతో కళకళలాడుతూ వర్ధిల్లుతుంది !

ఆరనైదోతనము చోటనుండు
అరుగులలికే వారి అరచేతనుండ

పెళ్లి అయ్యిన స్త్రీని ముత్తైదువ అని పిలుస్తారు – వారు ఐదు అలంకరణలతో ఎల్లపుడు కళకళలాడుతూ ఉంటారు – ఆ ఐదు అలంకరణలు – పసుపు, కుంకుమ, గాజులు, మెట్టెలు, మరియు మంగళసూత్రము. వీటిలో మెట్టెలు, మంగళసూత్రం పెళ్లి అయ్యిన తర్వాతే వస్తాయి – అందుకే వీటితో కలిపి స్త్రీ పరిపూర్ణత పొందుతుంది. అలా పొందిన దానినే “అయిదవతనం” అని కూడా అంటారు. ప్రతీ స్త్రీ తన అయిదవతనాన్నీ నిలబెట్టుకోవడానికి మంగళగౌరి వ్రతం మరియు అనేక నోములు, పూజలు చేసుకుంటుంది. అటువంటి అయిదవతనం ఎప్పుడు అరుగులాలికేవారి అరచేతిలో ఉంటుందిట !

అరుగు అంటే? తెల్లవారుతూనే మన తెలుగు వారి ఇళ్ల వాకిలి (వాకిలి అంటే – ఇంటి ముందు) తుడిచి శుభ్రపర్చుకొని కళ్ళాపు (నీళ్లు) జల్లి ముగ్గు వేస్తారు. ఇంటి గుమ్మానికి మరియు ఇంటి వాకిలికి మధ్యలో ఈఆరుగులు ఉంటాయి (ఫోటోలో చూడవచ్ఛు). ఆ అరుగులు వాటి మెట్లు కూడా వాకిలి తో కలిపి తుడిచి కడుగుతారు. కడిగిన వాకిలి లో చక్కని చుక్కల ముగ్గు వేస్తారు, అలాగే అరుగుల మీద/మెట్లమీద కూడా చిన్న గీతాల ముగ్గులు వేస్తారు. ఆ కాలంలో ఎవరైనా ఇంటినుండి బయటకి పొద్దున్నే పని మీద వెళ్లాలంటే, వాళ్ళు వెళ్లక ముందే ఈ కాళ్లపు జల్లి ముగ్గు వేసేయాలి అనేది ఒక ఆచారం. ఇంతకీ పాటలో అన్న మాట అదే – “అయిదవ తనము ఎక్కడ ఉంటుంది అంటే, ఆ అరుగులు అలికే (కడిగే) వారి చేతి లో ఉంటుందిట”.

తీరైన సంపద ఎవరింటనుండు
దినదినము ముగ్గున్న లోగిళ్ళనుండు
“కావాల్సినంత సంపద (అంటే డబ్బు, సౌఖ్యం, ఆరోగ్యం) ఎవరింట్లో ఉంటుంది అంటే – ప్రతీ రోజు ఇంటి ముందు ముగ్గున్న వారి ఇంట్లో ఉంటుంది” ట!!!

అది మన సాంప్రదాయం మరియు ఆచారం. ఇది ఏ కులానికో లేక మతానికో లేక వర్గానికో సంబంధం ఉన్నది కాదు. మీరు చిన్న చిన్న పల్లె లేక నగరం వెళితే ఇప్పడికీ పొద్దున్నే ఇలాంటి లోగిళ్ళు కనిపిస్తాయి. అది మనం కూడా పాటించడానికి ప్రయత్నించవచ్చు. ఇప్పుడు ఇళ్ళకి వాకిలి ఉండడమే అరుదు, ఇక అరుగులు ఎక్కడవి? అపార్ట్మెంట్స్ కదా. వీలు చేసుకొని, మన అపార్ట్మెంట్ తెలుపు తెరచిన వెంటనే ఉన్న చిన్న చోటులో వాకిలిగా తలచి రోజు ప్రొద్దున్నే శుభ్రపరచొకొని అక్కడ ఒక చిన్న ముగ్గు వేస్తే – మన ఇంటికి అందం, అలాగే ప్రొద్దున్నే కళకళలాడుతున్న మన ఇళ్ళకి లక్ష్మీ దేవి ముందు వస్తుంది !!!

కోటలో తులసమ్మ కొలువున్న తీరు
కోరి కొలిచే వారి కొంగు బంగారు
ప్రతీ ఇంటి వెనక ఆవరణలో మంచి తులసి కోట ఉంటుంది. దానికి పసుపు, కుంకుమలతో అలంకరిస్తారు. ఆ తులసమ్మ కొలువున్న తీరును బట్టి – అంటే దానికి ఇచ్ఛే గౌరవం, పొందే పూజలు బట్టి – ఆ ఇంట్లో వారికి కొంగు బంగారమవుతుందిట (అంటే సంపదలు కలుగుతాయి). అలాగే మన ఇళ్ళలో కూడా ఒక తులసి మొక్కని తప్పక పెంచుకోవాలి, అది కూడా ఒక కోటాలో పెట్టి దానిని అలంకరించుకొని పూజించాలి. గుమ్మానికి ముందు వైపు కనిపిస్తే అది ఇంకా అందం.

గోవు మాలక్ష్మికి కోటి దండాలు
కోరినంత పాడి నిండు కడవల్లు

తులసితో పాటు ఇంటి పెరటిలోఆవులు గేదెలు (పాడి అంటారు) కూడా ఉండేవి. ఇంట్లోవారికందరికి కావలసిన పాలు, పెరుగు, నెయ్యి ఆ గోవులిచ్చిన పాల నుండే వస్తాయి. ప్రొద్దున్నే లేచి ఇంటి వాకిలి శుభ్రం చేసుకొని, తులసి కోట శుభ్రం చేసుకొని పూజించి, గో మాతని కూడా పూజించాలి – అప్పుడే ఆ అమ్మ కోరినంత పాలు ఇఛ్చి ఇంటిల్లిపాదికి ఆకలి తీరుస్తుందిట.

మగడు మెచ్చిన చాన కాపురంలోన
మొగలి పూల గాలి ముత్యాల వాన
ఇంటి ఇల్లాలికి ఎంత సౌభాగ్యం
ఇంటిల్లిపాదికి అంత వైభోగం

మన సాంప్రదాయం లో ఇదొక నమ్మకం – నిజం కూడా. మగడు అంటే భర్త. భార్య భర్త కలసి కాపురం చేస్తుంటే, అది తీయగా సాగితే వారికి ఆనందం, మిగిలిన ఇంట్లో వాళ్లకి కుడా  ఎంతో సంతోషం. ఆ ఆనందం “మొగలి పువ్వుల వాన” అంత ఆహ్లాదంగా ఉంటుందిట. అంతే కదా మరి. వేరే ఇంటి అమ్మాయి కోడలుగా వఛ్చి కొత్తగా అందిరితో పరిచయం అయ్యే సమయంలో భర్త సహాయం చాలా అవసరం. భర్త మెప్పు కోసం చేస్తూ ఉంటుంది.  ఇలాగే భార్య భర్తకి అనుగుణంగా ఉండాలి. అప్పుడు ఆ ఇంట్లో ఎల్లప్పుడూ సంతోషం.

టూకీగా చెప్పాలంటే …. ఈ పాత మన పూర్వ సాంప్రదాయానికి అద్ధం పట్టి చూపుతోంది. అది మనం తెలుసుకోవాలి, ఆచరణ చేయ గలిగితే మీరు అదృష్టవంతులు, లేక పొతే కూడా తెలుసుకొని ఇంతలో వీలయితే అంతేనా చేద్దామని ప్రత్నిద్దాము!

ఇటువంటి పాట, సన్నివేశం మనకిచ్చిన ముత్యాలముగ్గు కళాకారులందరికి నమస్సుమాంజులు!

Leave a comment